దేవుడు మనలను ఎన్నటికీ సిగ్గుపరచడు
Updated: Aug 18

“యెహోవా, నేను నీలో ఆశ్రయం పొందాను; నన్ను ఎన్నటికీ అవమానానికి గురిచేయకుము.”
– కీర్తన 71:1
మన జీవితమంతా కూలిపోతున్నట్లు అనిపించినప్పుడు మనకు భద్రతనిచ్చే స్తలాన్నే ఆశ్రయమంటారు..
అక్కడే మనం నిశ్చింతగా ఉండగలం. "ఇక్కడ నేను సురక్షితంగా ఉన్నాను" అని నమ్మగలం.
కానీ, విషయం ఏంటంటే మనము దేన్నైతే లేకపోతే ఏవర్నైతే నమ్ముతామో వాళ్ళే మనల్ని మోసం చేస్తే?
మన బలహీనతలను, మన రహస్య పాపాల్ని అందరి ముందు బయటపెట్టి మనల్ని అవమానపరిస్తే?
అలాంటి నమ్మక ద్రోహాన్ని మనం తట్టుకోగలమా?
నేను కూడా నా జీవితంలో కూడా నేను ఎన్నో విషయాల్లో ఆశ్రయాన్ని వెదికాను.
కొన్నిసార్లు నా పరిచర్యలో, కొన్నిసార్లు ఇతరులు నన్ను గురించి ఏమనుకుంటారో అందులో.
వినోదంలో.
వేదాంత జ్ఞానంలో (నాకు అంత జ్ఞానం లేకపోయినా, ఉన్నట్లుగా నటించిన సందర్భాలూ ఉన్నాయి!).
నా స్వంత కోరికల్లో, సమాజంలో నాకు ఉన్న పేరు ప్రతిష్ఠలో, నాకు ఇష్టమైన మనుషులలో ఆశ్రయం పొందుకోటానికి ప్రయత్నం చేసాను.
రెండు తప్పుడు ఆశ్రయాలు
మనలో చాలామంది రెండు తప్పుడు ఆశ్రయాల మధ్య ఊగిసలాడుతూ ఉంటాం.
మొదటిది, నిజానికి మనకు అంతిమ భద్రత, సంతృప్తి, ఓదార్పు ఇవ్వలేని వాటిలో ఆశ్రయం వెదకడం.
ఉదాహరణకు, నీ ఉద్యోగాన్నే ఆశ్రయంగా మార్చుకొని జీవిస్తున్నప్పుడు, నీ ఎనిమిదేళ్ల బిడ్డకు బ్లడ్ క్యాన్సర్ ఉందని తెలిసినప్పుడు ఆ ఉద్యోగం నిన్ను ఆదరిస్తుందా?
నీవు ప్రేమించే వ్యక్తిలోనే నీ ఆనందమంతా ఉందని నమ్మి, నీ సమయాన్ని, ప్రేమను, శ్రమను నీ సమస్తాన్ని ఆ వ్యక్తికిచ్చి, నీ జీవితాన్ని ధారపోస్తే, ఒక రోజు ఆ బంధం తెగిపొయిందనుకో, నువ్వు ఎలా ఫీల్ అవుతావు?
అప్పుడు నీకు మిగిలేది గాయాలే.
ఆ నిరాశ, ఆ బాధ మనసుని పిండేస్తాయి.
రెండవది, మన హృదయాన్నే పూర్తిగా నమ్ముకోవడం.
మన హృదయం చెప్పిందే సరైందని చాలా త్వరగా నమ్మేస్తాం.
ఒక రకంగా చెప్పాలంటే అలా చేయకుండా ఉండడం కూడా కష్టం. ఎందుకంటే మనల్ని మనం బయట నుండి చూసుకునే అవకాశం ఉండదు కదా!
కానీ "హృదయం అన్నిటికంటే మోసపూరితమైనది." (యిర్మీయా 17:9) అని బైబిల్ చెబుతుంది.
మన హృదయం మనల్ని ఎంతగా మోసం చేస్తుందో మనమే గుర్తించలేం.
మనకు ఎక్కువ నష్టం చేసేది చాలాసార్లు బయటి శత్రువులు కాదు.
మన స్వంత హృదయమే.
అదే మనలను తప్పుదారిలో నడిపించి, చివరికి అవమానానికి గురిచేస్తుంది.
కానీ దేవుడే మన నిజమైన ఆశ్రయం
దేవుడు మాత్రం ఎప్పటికీ మనల్ని మోసం చేయడు.
ఎందుకంటే ఆయన తన నిబంధనకు ఎల్లప్పుడూ నమ్మకంగా ఉంటాడు.
తాను ఇచ్చిన మాటను తప్పడం కంటే, తానే బాధను భరించడానికి ముందుకొచ్చాడు.
అదే యేసుక్రీస్తులో జరిగింది.
మనలను కాపాడటానికి ఆయన బాధను అనుభవించాడు.
దేవుడు మన అవమానాన్ని బయటపెట్టి మనల్ని సిగ్గుపడనివ్వడు.
దానికి బదులుగా, మనం అనుభవించాల్సిన అవమానాన్ని తన కుమారుడైన యేసు సిలువపై భరించాడు.
మన కోసం యేసు అవమానానికి గురయ్యాడు.
తన నీతితో మన పాపాలను కప్పివేశాడు.
ఆయనలో ఆశ్రయం పొందిన వారిని నిజంగా రక్షిస్తాడు.
తన పిల్లలను కాపాడటానికి దేవుడు ఎంత దూరమైనా వెళ్తాడు.
మనలను రక్షించడానికి ఆయన తన సొంత కుమారుడినే విడిచిపెట్టలేదు. (రోమీయులకు 8:32)
మనం ఎన్నటికీ దేవునిచేత విడిచిపెట్టబడకూడదనే, సిలువపై యేసు ఒంటరిగా విడిచిపెట్టబడ్డాడు.
క్రీస్తు ద్వారా దేవుడు మనకు శక్తివంతమైన స్నేహితుడయ్యాడు.
ఆయన ఇలా వాగ్దానం చేశాడు:
"నేను నిన్ను ఎన్నటికీ విడువను, నిన్ను ఎన్నటికీ ఎడబాయను." (హెబ్రీయులకు 13:5)
కాబట్టి యేసు ఇచ్చే ఈ సురక్షితమైన ఆశ్రయంలో విశ్రాంతి పొందుదాం.
అయితే నీవు ఏమి చేయాలి?
పరుగెత్తు.
క్రీస్తు వైపు పరుగెత్తు.
ఆయనే నీకు నిజమైన భద్రతను ఇస్తాడు.
ఆయనే మన ఆశ్రయం.
ఆయన బలవంతుడు.
ఆయన దయగలవాడు.
నీ బాధ, శ్రమ, కష్టం ఆయనకు తెలుసు.
నిన్ను రక్షించడానికి క్రీస్తు చేరుకోలేని స్థలం ఏదీ లేదని గుర్తుంచుకో.
అలాగే, సాతానుతో, శరీర సంబంధమైన పాపపు కోరికలతో, ఈ లోక శోధనలతో నీవు చేసే ప్రతి పోరాటం వృథా కాదు.
ఈ యుద్ధంలో నీవు ఒంటరివి కాదు.
పరిశుద్ధాత్మ నిన్ను ఎన్నటికీ విడిచిపెట్టడు.
ఆయన తన పని నీలో పూర్తి చేసే వరకు నిన్ను నడిపిస్తూనే ఉంటాడు! మిత్రమా క్రీస్తులో ఆశ్రయం పొందుకో! ఆమెన్!






Comments