స్వేచ్ఛగా నడవండి
Updated: Aug 17

(గలతీయులకు 5:13–26 చదవండి)
మీరు యేసుక్రీస్తుకు చెందినవారైతే, ఆయనను విశ్వసించి, ఆయన సిలువపై పూర్తి చేసిన కార్యంలోనే మీ నిరీక్షణ ఉంచితే, మీరు ఇక ధర్మశాస్త్రానికి బానిసలు కాదు. పాపానికి కూడా బానిసలు కాదు.
ఇక దేవుడు మిమ్మల్ని అంగీకరించేలా నిరూపించుకోవడానికి జీవించాల్సిన అవసరం లేదు. ఎప్పుడూ సరైన మాటలు మాట్లాడాలని, అందరి ముందు మంచి వ్యక్తిలా కనిపించాలని, నిజంగా మీరు కాని వ్యక్తిగా నటించాలని కూడా అవసరం లేదు.
క్రీస్తులో మీరు నిజమైన స్వేచ్ఛను పొందారు.
అయితే పౌలు ఒక ప్రశ్న అడుగుతాడు:
"నీకు స్వేచ్ఛ లభించిన తర్వాత, మళ్లీ నిన్ను బానిసగా చేసే పనులనే ఎందుకు ఎంచుకుంటావు?"
ఇది చాలా సూక్ష్మమైన విషయం. మన హృదయంలో ఏమి జరుగుతుందో మనకే కొన్నిసార్లు గుర్తించడం కష్టం.
మనం దేవుని వాక్యాన్ని ఎందుకు చదువుతున్నాం?
సంఘంలో ఎందుకు సేవ చేస్తున్నాం?
దేవుణ్ణి ప్రేమించి చేస్తున్నామా? లేక మనల్ని మనం నిరూపించుకోవడానికా?
మనకు తరచూ కోపం వస్తుందా?
బయట ఒకలా, ఇంట్లో ఇంకొకలా ప్రవర్తిస్తున్నామా?
ఇలాంటి విషయాలు మన హృదయంలో ఏదో సరిగా లేదని చూపించే సంకేతాలు కావచ్చు.
అందుకే మనం మనల్ని మనం ఒక ప్రశ్న అడగాలి.
మన చూపు యేసుపైనా ఉంది? లేక కేవలం మతపరమైన పనులపైనా ఉంది?
మన చూపు యేసుపై ఉంటే, మనం కేవలం స్వేచ్ఛ పొందినవారిగానే కాదు, స్వేచ్ఛలో జీవించే వారిగా కూడా ఉంటాం.
యేసువైపు చూస్తే—
ప్రేమతో ఇతరులకు సేవ చేస్తాం.
మన శరీర సంబంధమైన పాపపు కోరికలతో పోరాడతాం.
పరిశుద్ధాత్మ ఫలాన్ని కనుపరుస్తాం.
దేవుడు వాగ్దానం చేసిన రాజ్యాన్ని స్వీకరిస్తాం.
ప్రియమైన సహోదర సహోదరీలారా, దేవుడు మనకు ఎంత గొప్ప వాగ్దానాలు ఇచ్చాడో చూడండి.
కాబట్టి ఈ వారం స్వేచ్ఛలో జీవించండి.
దేవుని అంగీకారం సంపాదించడానికి చేసే ప్రయత్నాలను విడిచిపెట్టండి.
యేసు పాదాల దగ్గర కూర్చోండి.
అక్కడే మన ఆత్మలకు నిజమైన విశ్రాంతి దొరుకుతుంది.
జాన్ బెరిడ్జ్ చెప్పిన ఈ మాటలు సువార్త సౌందర్యాన్ని ఎంతో చక్కగా తెలియజేస్తాయి:
"ధర్మశాస్త్రం 'పరుగెత్తు, శ్రమించు' అని ఆజ్ఞాపిస్తుంది. కానీ పరుగెత్తడానికి కాళ్లను, పని చేయడానికి చేతులను ఇవ్వదు. సువార్త మాత్రం ఎంతో మధురమైన శుభవార్తను ప్రకటిస్తుంది. అది 'ఎగురు' అని పిలవడమే కాదు, ఎగరడానికి రెక్కలను కూడా ఇస్తుంది."






Comments