ఈరోజు నీ హృదయం ఎలా ఉంది?
Updated: Aug 21

ఫ్రెండ్, ఈ రోజు నన్ను కొన్ని ప్రశ్నల్ని అడగనివ్వు.
ఈ రోజు నీ హృదయం ఎలా ఉంది?
నీవు నిజంగా దేనిని నమ్ముతున్నావు?
నీ మనసు ఎప్పుడూ దేని గురించి అలోచిస్తుంది?
ఏ విషయానికి నీవు పూర్తిగా దాసొహమయ్యావు?
ఒకవేళ నీవు దేన్నైతే కోరుకొంటున్నావో ఆ ఒక్క విషయం నీ జీవితంలో లేకపోతే నీ జీవితం దుర్భరం అనుకొంటున్నావా?
నీ హృదయంలో దేవునికి స్థానం ఉందా?
ఒకవేళ మన హృదయంలో ఉన్న ప్రతిదీ బయట చూపించే ఒక యంత్రం ఉంటే, అది దేనిని చూపిస్తుంది?
అసలు నీ హృదయం ఎలా పనిచేస్తుందో నీకు తెలుసా?
బైబిలు కౌన్సిలర్ జెరెమీ పియర్ తన "ది డైనమిక్ హార్ట్ "అనే పుస్తకంలో హృదయం ఎలా పనిచేస్తుందో చాలా చక్కగా వివరిస్తాడు.[1]
మన ఆలోచనలు, మన కోరికలు మరియు భావాలు, మన నిర్ణయాలు మరియు కార్యాలు—ఇవన్నీ
పాపపతనం వల్ల పాడైపోయాయి.
అందుకే మనలో ప్రతి ఒక్కరూ గాయపడిన హృదయంతో జీవిస్తున్నాం.
ఆ హృదయం దేవుణ్ణి కాకుండా తననే ప్రేమిస్తుంది.
అది మోసం చేస్తుంది.
లోభపడుతుంది.
గర్విస్తుంది.
స్వార్థంగా ఉంటుంది.
దేనిని ఇతరుల్ని దేవుని పిల్లలలాగ చూడకుండా, హృదయంలో ఉన్న శరీరేచ్చల కొరకు వాడుకొంటుంది.
ఇతరుల గురించి చెడుగా మాట్లాడుతుంది.
అసూయపడుతుంది.
అభద్రతతో జీవిస్తుంది.
తొందరగా కోపపడుతుంది.
ఇలా ఎన్నో విధాలుగా మన హృదయం చెడిపోయింది.
అయితే మన హృదయాన్ని దేవుడు ఎందుకు సృష్టించాడు?
మన హృదయం దేవుని మహిమను ప్రతిబింబించడానికి సృష్టించబడింది.
దేవుణ్ణి తెలుసుకొని, ఆయనలో ఆనందించడానికి మనకు హృదయాన్ని ఇచ్చాడు.
ఎలాగైతే ఒక విద్యుత్ ప్లగ్ విద్యుత్ సరఫరాకు కలిసినప్పుడు మాత్రమే పనిచేస్తుందో,
అలాగే మన హృదయం కూడా దేవునితో అనుసంధానమై ఉన్నప్పుడే సరిగా పనిచేస్తుంది.
పొద్దుతిరుగుడు పువ్వు ఎప్పుడూ సూర్యుడి వైపే తిరిగి ఎలా ఉంటుందో, అలాగే మన హృదయం కూడా ప్రతి విషయంలో దేవుని వైపే తిరిగి ఉండాలి.
కానీ అది దేవుని విడిచి మరో దిశలో తిరిగినప్పుడు, మన హృదయం మన నియంత్రణలో ఉండదు.
ఒక్కసారి ఆలోచించండి!
టామ్ హ్యాంక్స్ నటించిన Cast Away సినిమాలోలాగా మనం ఒంటరిగా ఒక ద్వీపంలో జీవిస్తే, మన సమస్యలన్నీ పోతాయా?
కానీ వాస్తవం ఏమిటంటే...
మనుషులను తప్పించుకోవచ్చు. కానీ మన హృదయాన్ని మాత్రం తప్పించుకోలేం.
ఎక్కడికి వెళ్లినా దేవుడు మనతోనే ఉంటాడు.
మన హృదయం కూడా మనతోనే ఉంటుంది.
అంతేకాదు, అసలు సమస్య ఏంటంటే,
మన హృదయం మనకే పూర్తిగా అర్థం కాదు.
మనల్ని నడిపిస్తున్న నమ్మకాలు,
మన ఉద్దేశాలు,
మన కోరికలు,
మన నిర్ణయాలు—
వీటిని చాలాసార్లు మనమే గుర్తించలేము. దానిని ఇంగ్లిష్లో 'Blindspots' అంటారు. అంటే మనం కొన్ని వాస్తవాలను చూడలేని పరిస్థితి.
మనకు తెలియకుండానే మన హృదయం మనల్ని ముందుకు లాక్కెళ్లిపోతుంది
అందుకే మనల్ని మనమే పూర్తిగా అర్థం చేసుకోవడం అంత సులభం కాదు.
దీనికి దావీదు మంచి ఉదాహరణ.
ఒక రోజు అతను బత్షెబాను చూశాడు.
ఆ సమయంలో తన హృదయం తనను ఎంతగా మోసం చేస్తుందో అతనికి తెలియదు.
మొదట ఆమెను చూశాడు.
తర్వాత ఆమెను తన దగ్గరకు పిలిపించుకున్నాడు.
ఆమెతో వ్యభిచారం చేశాడు.
ఆ తరువాత ఆ పాపాన్ని దాచిపెట్టడానికి ప్రయత్నించాడు.
అతను చాలా రకాలుగా అలోంచించాడు.
పథకాలు వేశాడు.
ఆ క్రమంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నాడు.
"ఎలాగైనా నన్ను నేను కాపాడుకోవాలి." అని అనుకొన్నాడు
ఎవరైనా తనకు అడ్డుగా వస్తే,
వారిని చంపడానికి కూడా సిద్దపడ్దాడు.
చూశారా తన హృదయ పరిస్థితి ఎంత దారుణంగా దిగజారిపోయిందో?
తన హృదయం తనని ఎక్కడికి ఈడ్చుకెళ్తుందో ఆయనకే తెలీదు.
నాతాను వచ్చి ఒక ఉపమానం చెప్పినప్పుడు,
ఆ మోసగాణ్ణి తానే అని తెలుసుకొని దావీదు ఆశ్చర్యపోయాడు.
తన హృదయం తనను ఎంతగా మోసం చేసిందో అప్పుడే అతనికి అర్థమైంది.
ఇలాంటి మోసపూరితమైన మన హృదయాన్ని ఎవరు మార్చగలరు?
మన హృదయాన్ని మనం మార్చుకోలేం. దాన్ని దేవుడే మార్చగలడు.
మన సమస్య హృదయంలో ఉంటే,
బయట కనిపించే ప్రవర్తనను (behavior) మాత్రమే మార్చుకొంటేసరిపోదు.
గుండె జబ్బు ఉన్నవారికి కేవలం గాయంపై బ్యాండేజ్ వేస్తే సరిపోతుందా?
కొన్నిసార్లు మన బోధన, మన కౌన్సిలింగ్ ఎలా ఉంటుందంటే,
ఉదాహరణకు,
ఒక వ్యక్తి అశ్లీల చిత్రాల వ్యసనంతో ( pornography) పోరాడుతున్నాడనుకుందాం.
"అది పాపం."
"ఫోన్ తీసుకెళ్లొద్దు."
"ఎవరితోనైనా నీ పాపాన్ని ఒప్పుకో."
"మళ్లీ చేస్తే నీ రక్షణనే సందేహించాల్సి వస్తుంది."
"పశ్చాత్తాపపడు." అని చెప్తాం.
ఇవన్నీ మంచి మాటలే అయినా వాటివలన మన హృదయం మారదు.
వాస్తవం ఏంటంటే మనకు హృదయాన్ని ఎలా మార్చుకోవాలో మనకు తెలీదు..
అందుకనే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పరిశుద్ధాత్మ మాత్రమే హృదయాన్ని మార్చగలడు
పరిశుద్ధాత్మ సహాయం లేకుండా
దేవునిలో ఆనందించే హృదయం,
నిజమైన పశ్చాత్తాపం,
నిజమైన మార్పు సాధ్యం కాదు.
ఇది దేవుని కార్యం.
మనం కూడా మనస్ఫూర్తిగా దేవుణ్ణి వెదకాలి.
దేవుణ్ణి, ఆయన వాక్యాన్ని నమ్మాలి.
అదే విశ్వాస జీవితం అంటే.
హెబ్రీయులకు రాసిన పత్రిక చెబుతోంది:
"దేవుణ్ణి వెదికేవారికి ఆయన ప్రతిఫలం ఇస్తాడు." (హెబ్రీయులకు 11:6).
ఐతే నీకు ఒక ప్రశ్న రావొచ్చు.
మరి నీ హృదయం దేవుణ్ణి కోరుకోకపోతే ఏమి చేయాలి?
ప్రార్థన చేయాలనే మనసు లేకపోయినా, "ప్రభువా, నాకు ప్రార్థించాలనే కోరిక లేదు. నాకే సహాయం చేయి" అని ప్రార్థించు.
నీ ఫీలింగ్స్ని నమ్మొద్దు.
దేవుని దగ్గరకు రావాలనే మనసు లేకపోయినా ఆయన దగ్గరకు రావడమే విశ్వాసమని నమ్ము.
కీర్తన 103 ను జ్ఞాపకం చేసుకో. దేవుడు కనికరముగలవాడు. రక్షించగలవాడు. ఈ నమ్మకంతో ఆయన దగ్గరకు వెళ్లు.
బైబిల్లో పెద్ద పెద్ద భాగాలుగా కాకుండా కొద్దికొద్దిగా చదువు.
దేవునిలో ఆనందించడం కోసం చదువు.
దేవుని సన్నిధిలో కొంతసేపు నిశ్శబ్దంగా ఉండడం నేర్చుకో. మొదట కష్టంగా అనిపించినా, అది ఎంతో విలువైనది.
ఆయన వాక్యాన్ని నెమరువేసుకో.
సంఘంలోని విశ్వాసులతో కలిసి ప్రార్థించు.
వారమధ్య జరిగే బైబిలు అధ్యయనాలకు హాజరవు. దేవుడు ఒక సహోదరుడు లేదా సహోదరి ద్వారా నీతో మాట్లాడవచ్చు.
ముఖ్యంగా, సువార్తను నమ్మకంగా ప్రకటించే స్థానిక సంఘంలో సభ్యుడిగా ఉండు. ఇతరులకు సేవ చేయి. వారి జీవితాల పట్ల ఆసక్తి చూపు.
రోజంతా ఫోన్‌లోనే మునిగిపోకు.
ప్రభుభోజనాన్ని ఎంతో విలువగా తీసుకో. అది కేవలం ఒక ఆచారం కాదు; యేసు నీపై చూపించిన ప్రేమకు కనిపించే గుర్తు.
ఒక్కసారి ఆలోచించు...
సర్వలోకాధిపతి నీతో ఇలా మాట్లాడుతున్నాడు
"నీ గురించి అన్నీ నాకు తెలుసు. అయినా నేను నిన్ను ద్వేషించడం లేదు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నావైపు చూడు. ఈ రొట్టెను చూడు. ఇది నీ కోసం ఇవ్వబడిన నా శరీరానికి గుర్తు. ఈ పాత్రను చూడు. నీ కోసం నేను చిందించిన నా రక్తానికి గుర్తు. దీన్ని తీసుకో. నన్ను జ్ఞాపకం చేసుకో. ఇది నీపై నాకున్న ప్రేమకు గుర్తు."
ఇలాంటి ప్రేమను చూసినప్పుడు...
నీ హృదయం యేసు కోసం కొట్టుకోకుండా ఉంటుందా?
ప్రభువు మనందరికీ యేసుతో నిండిన హృదయాన్ని అనుగ్రహించుగాక. ఆమేన్.
[1]జెరెమీ పియర్, ది డైనమిక్ హార్ట్ ఇన్ డైలీ లైఫ్ (గ్రీన్స్‌బోరో, NC: న్యూ గ్రోత్ ప్రెస్, 2016), 17, 53-68.






Comments